
వరుస సినిమాలతో కుర్రహీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తన 99వ సినిమా కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. బాలయ్య 99వ సినిమా కావడంతో మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.
మే 29న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరగనున్నాయి. ‘డిక్టేటర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 12నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ వెతుకుతోంది. ఇదే విషయమై ఓ ప్రముఖ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం విశేషంగా కనిపిస్తోంది. యువ సంగీత దర్శకుడు, అతి కొద్దికాలంలోనే చాలామంది పెద్ద హీరోలతో పనిచేసిన థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాలయ్య, థమన్‌ల కాంబినేషన్లో రూపొందే మొదటి సినిమా డిక్టేటరే!

