
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మీ’లో లీడ్ రోల్‌లో కనిపించే అవకాశాన్ని సొంతం చేసుకోవడంతో సత్యదేవ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఛార్మీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో సత్య దేవతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న) జ్యోతిలక్ష్మీ అవకాశం ఎలా వచ్చింది?
స) పూరీ జగన్నాథ్ డైరెక్షన్ టీమ్‌లో ఒకరైన ప్రదీప్ నుంచి ఓ రోజు ఆడిషన్ కాల్ వచ్చింది. నాకు ఈ సినిమా గురించి అప్పటికింకా ఏమీ తెలియదు. ఆడిషన్ జరిగేప్పుడు ఛార్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆడిషన్ జరిగిన వారం తర్వాత పూరీ గారు నన్ను కలవాలనుకుంటున్నారని కాల్ వచ్చింది. పూరీ గారిని కలిసిన తర్వాత ఆయన నన్ను కొంత బరువు తగ్గి మళ్ళీ కనపడమన్నారు. ఆ తర్వాత దాదాపుగా 16కేజీలు తగ్గాక ఆయనను కలిశా. అప్పుడే ‘జ్యోతిలక్ష్మీలో నువ్వు లీడ్ రోల్ చేస్తున్నావ్’ అన్నారు.
ప్రశ్న) ఈ అవకాశం వచ్చిన వెంటనే ఎలా ఫీలయ్యారు?
స) నాకైతే అసలు మాటలు రాలేదు. పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడితో పనిచేయడమంటే అది మన కల నెరవేరడం లాంటిది. పూరీ లాంటి జీనియస్ డైరెక్టర్‌తో సినిమా ఆఫర్ వచ్చాక అంతకంటే ఎక్కువ నేనేం కోరుకోగలను!
ప్రశ్న) ‘జ్యోతిలక్ష్మీ’లో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నేను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించా. జ్యోతిలక్ష్మీ అనే ఓ సెక్స్ వర్కర్‌ను ప్రేమించే అబ్బాయిగా ఇందులో కనిపిస్తా. జ్యోతిలక్ష్మీ జీవితంలో నా క్యారెక్టర్ తెచ్చిన మార్పులేంటి? ఆమె జీవితం ఎలా మారిపోయిందనేది ఈ సినిమాలో నా క్యారెక్టర్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.
ప్రశ్న) పూరీ జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
స) జీవితంలో ఎప్పుడో ఒకసారి గాని రాని అద్భుతమైన అవకాశమది. పూరీ గారిని చూస్తేనే చాలా నేర్చుకోవచ్చు. క్యారెక్టర్‌పై, స్క్రిప్ట్‌పై ఆయనకున్న పట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే! నేనైతే ఆయన్ను ఓ దేవుడిలా చూస్తా. ఆయనేది చేసినా దాని నుంచి నేర్చుకునేది ఏదో ఒకటీ తప్పకుండా ఉంటుంది.
ప్రశ్న) జ్యోతిలక్ష్మీ సినిమా హైలైట్స్ ఏంటి?
స) కథ, జ్యోతిలక్ష్మీ క్యారెక్టర్‌లను ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమా చూశాక స్త్రీని చూసే కోణంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిస్తున్న గౌరవం కంటే మరింత ఎక్కువ గౌరవాన్ని ఇస్తామని చెప్పగలను.
ప్రశ్న) స్టార్‌డమ్ ఉన్న నటి ఛార్మీ సరసన నటించడం ఎలా అనిపించింది?
స) ఛార్మీ గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉండేది. అంత పెద్ద స్టార్ సరసన నేనిలా కంఫర్టబుల్‌గా నటించానంటే ఆ క్రెడిత్ ఆమెకే దక్కుతుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా అవ్వడం చేత ప్రతీ డిపార్ట్‌మెంట్‌నూ దగ్గరుండి చూసుకున్నారు ఛార్మీ.
ప్రశ్న) భవిష్యత్‌లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు?
స) ఈ రకమైన పాత్రలు మాత్రమే చేస్తానని నేను ఎలాంటి పరిధులు గీసుకోను. సినిమాకు అవసరమైనదై, నన్ను ఎగ్జైట్ చేసే ఏ రోల్ అయినా చేస్తా. భవిష్యత్‌లో రకరకాల పాత్రల్లో నటించిన నటుడిగా ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకోవాలన్నదే నా లక్ష్యం.
ప్రశ్న) ఈమధ్యే రామ్ గోపాల్ వర్మ మీ నటనను ప్రశంసించారు కదా. ఎలా అనిపించింది?
స) ఇలాంటి సందర్భాల్లో నిజంగా నాకేం మాట్లాడాలో కూడా తెలియదు. రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప దర్శకుడి దగ్గర్నుంచి అభినందనలు దక్కడమంటే చాలా సంతోషమే కదా! జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
ప్రశ్న) నటన పరంగా ఎవర్ని ప్రేరణగా తీసుకున్నారు?
స) హాలీవుడ్ నటుడు డానియల్ డే లూయీస్ నా ఫేవరైట్ యాక్టర్. ఆయన సినిమాల ద్వారా చాలా విషయాలను ప్రేరణగా తీసుకుంటూంటా. ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వాళ్ళ నుంచి కూడా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూంటా.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?
స) ఇప్పటికైతే నా దృష్టంతా జ్యోతిలక్ష్మీపైనే ఉంది. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ‘క్షణం’ సినిమాలో నా పార్ట్ ఇప్పటికే పూర్తి చేశా. జ్యోతిలక్ష్మీ రిలీజ్ అయ్యాక ఆ తర్వాత ఏంటనేది చెప్పగలను.
ఇక అక్కడితో సత్య దేవతో మా ఇంటర్వ్యూ ముగించాం. జూన్ 5న జ్యోతిలక్ష్మీ విడుదలవుతున్న సందర్భంగా సినిమా యూనిట్‌కు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

