
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఇప్పటికే ఓసారి వాయిదా పడిన విషయం తెలిసిందే! తాజాగా జూన్ 13న తిరుపతిలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కీరవాణి ఆధ్వర్యంలో రూపొందిన ఆడియోతో పాటు మరో కొత్త ట్రైలర్‌ను కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆడియో రిలీజ్‌కు ఇంకా మూడు రోజులు ఉండగానే బాహుబలి ఆడియో లీకవ్వడం శోచనీయం. ఇప్పటికే వాట్సాప్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీసుల్లో బాహుబలి ఆడియో హల్‌చల్ చేస్తోంది. ఆ ఆడియోను విన్నవారు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. బాహుబలి సినిమా ఇంతకుముందే ఒకసారి లీక్‌కు గురవ్వడం పెద్ద సంచలనమే రేపింది. ఆ తర్వాత నుంచి బాహుబలి టీమ్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా మరోసారి లీక్ బారిన పడడం ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. జూలై 10 తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే!

