మ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరీర్‌లో మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఆయన, తాజాగా తన 34వ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాతో ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా మారుతున్నారు. ఎన్నో భారీ చిత్రాలకు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతుండటంతో, ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్‌లు సరికొత్త స్థాయిలో ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సరసన అనార్కలి హీరోయిన్‌గా నటిస్తోంది.
భారీ సాంకేతిక నిపుణులతో..
గతంలో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాకు అగ్రశ్రేణి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలకు ప్రాణం పోసే సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టాప్ టెక్నీషియన్స్ కలయిక చూస్తుంటే, ఒక భారీ యాక్షన్ విజువల్ ట్రీట్ రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.


