పకడ్బందీగా ‘శంకరాభరణం’ ప్రీ ప్రొడక్షన్!

పకడ్బందీగా ‘శంకరాభరణం’ ప్రీ ప్రొడక్షన్!

Published on Jun 11, 2015 8:15 AM IST

kona-venkat-nikhil
విభిన్న సినిమాలతో దూసుకుపోతున్న హీరో నిఖిల్ తాజాగా స్టార్ రైటర్ కోన్ వెంకట్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! వీరిద్దరి కలయికలో ‘శంకరాభరణం’ అనే పేరుతో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వెలువ్వడ్డప్పటి నుంచే ఈ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి ఏర్పడింది. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి మూడు కొత్తదనమున్న సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ ఈసారి బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా కోసం సిద్ధమైపోయారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ, “కోన వెంకట్ గారు స్క్రిప్ట్ విషయంలో ఎంత పకడ్బందీగా ఉంటారో ఇప్పుడే తెల్సుకున్నా. ఒకటికి రెండు సార్లు చదవడం, కొత్తగా మార్పులు ఉంటే చూసుకోవడం ఇలా ప్రతీ విషయంలో కోన వెంకట్ గారు ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసింది. శంకరాభరణం మీ అందరికీ విపరీతంగా నచ్చే సినిమా అవుతుంది. త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తా!” అన్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేలను అందించడంతో పాటు ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్నారు. నిఖిల్ సరసన హీరోయిన్‌గా నందిత ఎంపికైన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు