
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కొత్త సినిమా కోసం కథ సిద్ధం చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రౌడీ సినిమాతో తన స్థాయికి తగ్గ నటన, పాత్రతో మెప్పించిన మోహన్ బాబు, ఆ తర్వాత మళ్ళీ యమలీల 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన నటించబోయే సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
మోహన్ బాబు నిర్మిస్తూ, నటించిన సినిమా ‘పెదరాయుడు’ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు. ఓ మరాఠీ సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నానని, ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతానికి ఆ మరాఠీ సినిమా ఏదనే విషయమై ఎలాంటి సమాచారం లేకున్నా సందూక్ సినిమాకు రీమేక్‌గా మోహన్ బాబు కొత్త సినిమా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది.

