
‘అలా మొదలైంది’ లాంటి సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెలుగు పరిశ్రమను తన వైపుకు తిప్పుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ చేసిన రెండో సినిమా ‘జబర్దస్త్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో గ్యాప్ తీసుకొని మరో పర్ఫెక్ట్ కథను సిద్దం చేసుకున్న నందిని రెడ్డి యువహీరో నాగశౌర్యతో తన మూడవ సినిమాను మొదలు పెట్టింది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ఇటీవలే నిర్విరామంగా షూటింగ్ జరుపుకొని అప్పుడే చివరి దశకు చేరుకుంది.
తన సినిమాలలో కథకి సింక్ చేస్తూనే డిఫరెంట్ టైటిల్స్ ని పెట్టే నందినిరెడ్డి ఈ సారి కూడా ఓ డిఫరెంట్ టైటిల్ తో రానుంది. నాగ శౌర్య సినిమాకి నందిని రెడ్డి ‘కళ్యాణ వైభోగమే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. 70%కి పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమాలో ఇంకా కొన్ని సీన్స్, పాటల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. లవర్ బాయ్‌గా మంచి పేరు సంపాదించుకున్న నాగ శౌర్యతో నందిని రెడ్డి తన స్టైల్ రొమాంటిక్ కామెడీ సినిమాతో అలరించనున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ శౌర్య నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది.

