
ఇప్పుడు ఏ సినీ అభిమాని మాట్లాడినా అది తిరిగి తిరిగి ‘బాహుబలి’ గురించే అయి ఉంటోంది. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటికే జోరుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున జూలై 10న విడుదల కానుంది.
‘బాహుబలి’ సినిమా విడుదలకు మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో సినిమా గురించి మరికొన్ని విషయాలను తెలియజేస్తూ నేడు రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సంబంధించిన సౌండ్ ట్రాక్ నిన్ననే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోగా, ఆ ట్రాక్‌లో వచ్చే విజువల్స్‌తో కూడిన ట్రైలర్ చూశాక సినిమా కోసం ఇంకొక్క నిమిషం కూడా ఆగలేము అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా.. మంచులో ఫైట్, జలపాతం, మాహిష్మతి సామ్రాజ్యం, బాహుబలి వైభవం ట్రైలర్లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. అభిమానులకైతే ప్రస్తుతానికి ఈ నిమిషం ట్రైలర్ పండగ వాతావరణాన్నే తెచ్చిపెట్టింది. ఇక పూర్తి స్థాయి సినిమా చూసి పండగ చేసుకోవడానికి మాత్రం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే!
బాహుబలి కొత్త ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

