
ఇండియాలో మొట్ట మొదటి సారిగా సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. బడ్జట్ లోనే కాదు విజువల్స్ పరంగా కూడా హాలీవుడ్ ని తలపించే రీతిలో తీసిన ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తం నాలుగు భాషల్లో కలిపి ఈ సినిమా 4000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కి ఒక్క రోజే ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా టికెట్స్ కి భారీ క్రేజ్ నెలకొంది. లోకల్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది.
యుఎస్ లోని డల్లాస్ లో మొదటి సారి ఓ తెలుగు సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. బాహుబలి మూవీ డల్లాస్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన సమాచారం ప్రకారం ‘సినిమా రిలీజ్ కి ముందే మొదటి 8 షోస్ హౌస్ ఫుల్ అవ్వడం డల్లాస్ లో ఇదే మొదటి సారి. అలాగే ఫస్ట్ షో కూడా పడకముందే మొత్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 50,000 టికెట్స్ అమ్ముడు పోవడం ఇదే ప్రధమం, మునుపెన్నడూ ఇలా జరగలేదని’ వారు తెలియజేశారు. ఒక్క డల్లాస్ లోనే కాదు మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా రికార్డ్ స్థాయిలో బాహుబలి టికెట్స్ అమ్ముడు పోతున్నాయి.
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. భారే అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందనే దాని కోసం మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..

