
అల్లరి నరేష్ సినిమాలంటే రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమాలుగా అందరూ చెబుతుంటారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మరో కామెడీ సినిమా ‘జేమ్స్ బాండ్’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా గతంలో శ్రీను వైట్ల తెరకెక్కించిన చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. జూలై 24న ‘జేమ్స్ బాండ్’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయి కిషోర్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ముందుగా మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు?
స) నేను పుట్టి పెరిగిందంతా హైద్రాబాద్‌లోనే., చదువుకునే రోజుల్లో సినిమాలంటే బాగా ఆసక్తి ఉండేది. సినిమాల గురించి ఆలోచిస్తున్నప్పుడే దర్శకుడవ్వాలన్న కోరిక బలంగా పుట్టింది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో కొన్నేళ్ళ పాటు వైవీఎస్ చౌదరి, శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాక చివరకు ఇప్పుడిలా దర్శకుడినయ్యా.
ప్రశ్న) మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
స) నిజానికి నేను 2003లోనే దర్శకుడవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం మానేసి అవకాశాల కోసం వేట మొదలుపెట్టాను. అప్పుడే రెండు సినిమాలు ఓకే అయి చివర్లో ఆగిపోయాయ్! ఇక ఆ తర్వాత పరిస్థితి కొంచెం అదుపు తప్పిందని గమనించాక, రచయిత గోపీ మోహన్ సలహా మేరకు శ్రీనువైట్ల గారితో ప్రయాణం మొదలుపెట్టా. ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఇలా ‘దూకుడు’ వరకూ ఆయనతో పనిచేశా. ‘దూకుడు’ సమయంలోనే అనిల్ సుంకర గారు నన్ను దర్శకుణ్ణి చేస్తానని మాటిచ్చారు. ఆ క్రమంలోనే ఆయనకో స్క్రిప్ట్ వినిపిస్తే, చాలా ఎగ్జైట్ అయ్యారు. ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పి నా వెన్ను తట్టారు. ఆయన అందించిన ప్రోత్సాహం ఫలితమే ఈ ‘జేమ్స్ బాండ్’.
ప్రశ్న) అల్లరి నరేష్‌ను ఈ సినిమాకు ఎలా ఒప్పించారు?
స) అనిల్ సుంకర గారే ‘జేమ్స్ బాండ్’ కథ గురించి అల్లరి నరేష్ గారికి చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి పూర్తి కథ వినిపించా. ‘ఇలాంటి కథల కోసమే నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆయన కూడా ఈ స్క్రిప్ట్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. కొన్ని నెలల పాటు అందరికీ కనెక్ట్ అయ్యే కామెడీ అంశాలను జోడిస్తూ స్క్రిప్ట్‌ను పకడ్బందీగా రూపొందించాం. ఒక్కసారి ఫైనల్ స్క్రిప్ట్ చూశాక అల్లరి నరేష్ గారు ఈ సినిమా విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
ప్రశ్న) ‘జేమ్స్ బాండ్’ సినిమా గురించి చెప్పండి?
స) ‘జేమ్స్ బాండ్’ ఓ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. డిఫరెంట్ కథ, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ అన్నీ కలిపి ఈ సినిమాకు కొత్తదనాన్ని కల్పిస్తూనే, అల్లరి నరేష్ మార్క్ కామెడీతో అందరినీ మెప్పిస్తుంది. సినిమా కథకు తగ్గట్టుగానే బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అల్లరి నరేష్ బ్రాండ్ కామెడీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయి.
ప్రశ్న) ‘జేమ్స్ బాండ్’ అనే టైటిల్. నేను కాదు నా పెళ్ళాం అనేది ట్యాగ్‌లైన్.. ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ కాంబినేషన్ గురించి చెప్పండి?
స) ఎవరితోనూ గొడవలు పెట్టుకోడానికి ఇష్టపడని ఓ సాధారణ హీరో, ఒక పెద్ద లేడీ డాన్‌ను పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. హీరో ఓ డాన్‌ను ఎందుకు పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది? ఆ తర్వాత అతడి జీవితంలో వచ్చిన మార్పులేంటి? అన్న ఆసక్తికర అంశాల చుట్టూ నడిచే కథ కాబట్టి ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. నిజానికి ఈ సినిమాకు ఇంకా చాలా టైటిల్స్ పరిశీలనలోకి వచ్చినా చివరకు ఈ టైటిల్‌ను ఫైనల్ చేశాం. అలా అని ఈ సినిమా హీరోయిన్ డామినేటెడ్ స్టోరీ కాదు. సినిమాలో రెండు పాత్రలూ హైలైట్‌గా నిలుస్తాయి.
ప్రశ్న) అల్లరి నరేష్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
స) మొదటి సినిమాకే అల్లరి నరేష్ లాంటి వ్యక్తిత్వమున్న హీరోతో పనిచేయడం నా అదృష్టం. 48 సినిమాలు చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపున్న హీరో నాలాంటి కొత్త డైరెక్టర్‌కి ఈ స్థాయి ఫ్రీడం ఇవ్వడమంటే అది ఆయన గొప్పదనమే! నేనేం కావాలనుకున్నానో అదివ్వడానికి ఎన్ని టేకులైనా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించారు. ఆయన దగ్గర్నుంచి చాలా విషయాలే నేర్చుకున్నా.
ప్రశ్న) హీరోయిన్ సాక్షి చౌదరి గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి చాలా ప్రత్యేకత ఉంది. ఒక డాన్‌గా పొగరును చూపించాల్సిన తరహా పాత్ర అది. అంతే కాకుండా డాన్ అనగానే నమ్మేలా కూడా ఆ పాత్ర ఆహార్యం ఉండాలి. చాలా మందిని సంప్రదించాక చివరకు సాక్షి చౌదరిని ఎంపిక చేశాం. సినిమా చూశాక ఈ పాత్రను ఆమె తప్ప మరొకరు చేయలేరు అన్నంత బాగా చేసింది.
ప్రశ్న) దర్శకుడిగా మీకిది మొదటి సినిమా, అందులోనూ ఓ కామెడీ సబ్జెక్ట్.. ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా?
స) కామెడీని డీల్ చేయడంలో రిస్క్ ఉంటుందని నేననుకోను. కరెక్ట్ పంచ్, ఫన్‌ను పట్టుకుంటే కామెడీతో ఆకట్టుకోవచ్చు. శ్రీను వైట్ల గారి దగ్గర ఇన్నేళ్ళుగా నేర్చుకున్న అంశాలు కూడా బాగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. ఈ సబ్జెక్ట్‌లో మంచి ఫన్ ఉంది. దానికి తగ్గట్టుగా సన్నివేశాలలో మంచి పంచ్ లు ఉండేలా ఉండేలా రూపొందించాం. ఆ విషయంలో విజయం సాధించాననే అనుకుంటున్నా.
ప్రశ్న) మొదటి సినిమా అనుభవం ఎలా ఉంది?
స) చాలా బాగుంది. దర్శకుడిని అవ్వడానికి చాలా కాలమే పట్టినా, మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాననే సంతృప్తి ఉంది. ముఖ్యంగా అనిల్ సుంకర గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయనే లేకపోతే ఈ సినిమాయే లేదు. అల్లరి నరేష్ గారు ఈ సినిమాకు తనదైన మార్క్‌ను తెచ్చిపెట్టారు. ‘జేమ్స్ బాండ్’ సినిమాతో ఎలాంటి సినిమానైనా తీయగలననే నమ్మకం నాకు కలిగింది. రేపు ప్రేక్షకులకు కూడా అదే నమ్మకాన్ని కలిగిస్తే.. నేను విజయం సాధించినట్టే!
ప్రశ్న) ‘జేమ్స్ బాండ్’ మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. ఇంతకుముందు మనం చూడనటువంటి ఓ సరికొత్త కథలో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అంశం చూడడం ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. అల్లరి నరేష్, సాక్షి చౌదరిల యాక్టింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, లొకేషన్స్ హైలైట్స్‌గా నిలుస్తాయి.
ప్రశ్న) ‘జేమ్స్ బాండ్’ తర్వాత ఏదైనా సినిమా ఒప్పుకున్నారా?
స) ఇంకా లేదు. ఈ సినిమా ద్వారా నాపై నాకు ఓ అభిప్రాయం వచ్చాక కొత్త సినిమా మొదలుపెడతా. కథలైతే చాలానే సిద్ధంగా ఉన్నాయి. జేమ్స్ బాండ్ రిలీజ్ తర్వాత గానీ నా కొత్త సినిమా ఏమై ఉంటుందనేది చెప్పలేను.

