టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఇటీవల ‘శంభాల’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వైవిధ్యమైన కథాంశాలతో పాటు కమర్షియల్ హంగులున్న చిత్రాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది తన నెక్స్ట్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రంలో బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ‘సైరాభాను’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన కలర్‌ఫుల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ఏ ఫన్ ఫిల్డ్ జర్నీ ఆఫ్ లవ్, ఫెయిత్ & డెస్టినీ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ పోస్టర్‌లో గులాబీ రంగు మేఘాలు, చార్మినార్, వైజాగ్ బీచ్ రోడ్ మరియు రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ వంటి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక అందమైన ఫాంటసీ మరియు రొమాంటిక్ థీమ్‌ను ప్రతిబింబిస్తోంది.
హిందూ-ముస్లిం ప్రేమకథ నేపథ్యంలో, కామెడీకి పెద్దపీట వేస్తూ ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ‘కే ర్యాంప్’ వంటి హిట్‌ను అందించిన రాజేష్ దండా, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


