
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్ తన రెండో సినిమా ‘కంచె’కు విలక్షణ దర్శకుడు క్రిష్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ఇప్పుడీ రెండో సినిమా ‘కంచె’లో సరికొత్త పాత్రలో ఇంకా బాగా నటించారట. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలను తెరకెక్కించిన క్రిష్, ఈ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరచే కథతో రానున్నారట.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన నాగబాబు చాలా ఎగ్జైట్ అయ్యారట. స్టన్నింగ్ విజువల్స్, గ్రాండియర్, వరుణ్ తేజ్ యాక్టింగ్ ఆయన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయని యూనిట్ వర్గాల సమాచారం. ఆ మధ్య విడుదలైన వరుణ్ తేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా రాజీవ్‌రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

