‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వర్షన్ లేటెస్ట్ అప్‌డేట్స్

‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వర్షన్ లేటెస్ట్ అప్‌డేట్స్

Published on Aug 26, 2015 10:06 PM IST

baahubali
జూలై 10 2015.. ఇండియన్ సినిమాలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ‘బాహుబలి’ పేరుతో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినీ అద్భుతం 50 రోజులకు చేరువైనా ఇంకా అదే సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. విడుదలైన నాటినుంచే భాషా, ప్రాంతం అన్న సంబంధం లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా, ఇండియన్ సినిమా మార్కెట్, టెక్నికల్ స్టాండర్డ్స్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది.

ఓవరాల్‌గా ఇండియన్ మార్కెట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఖ్యాతి గడించిన ‘బాహుబలి’, ఓవర్సీస్‌లోనూ అదే స్థాయి వసూళ్ళను సాధించింది. అయితే ఓవర్సీస్ మార్కెట్లో ‘పీకే’, ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాల తర్వాతే ‘బాహుబలి’ కలెక్షన్స్ ఉన్నాయి. కాగా ఈ రెండు సినిమాలను కూడా దాటేసే అవకాశం మరికొద్దిరోజుల్లో రానుందనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాల అంచనా. ఇంటర్నేషనల్ వర్షన్‌ ద్వారా బాహుబలికి ఈ అవకాశం ఉండనుందని తెలుస్తోంది.

మొదట్నుంచీ ‘బాహుబలి’ సినిమాకు ఓ ఇంటర్నేషనల్ వర్షన్ కూడా ఉంటుందని దర్శకుడు రాజమౌళి చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినరోజు నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్ బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ కోసం పని చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వర్షన్‌ను పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధం చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు. ఇంటర్నేషనల్ వర్షన్‌కు సుమారు 20 నిమిషాల మేర కత్తెర పడనుందని సమాచారం. ఇక ఈ వర్షన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే పీకే, భజరంగీ భాయ్‌జాన్ సినిమాల రికార్డులు కూడా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి సొంతమవుతాయని ట్రేడ్ టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు