
‘భలే భలే మగాడివోయ్’.. హీరో నాని, దర్శకుడు మారుతిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి కొత్తగా లాంచ్ అయిన గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎలిమెంట్స్‌తో నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, నారి కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలిచింది. ఇక మొదట్నుంచే ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన టీమ్, ఆ ప్రచార కార్యక్రమాలతోనే సినిమాపై మంచి క్రేజ్ కలిగించింది.
ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా విడుదలైన మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్‌తో సినిమా ప్రదర్శితమవుతోంది. నాని కెరీర్లో ఈ సినిమా హయ్యస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని ట్రేడ్ టాక్. నాని బ్రాండ్ కామెడీ టైమింగ్, మారుతి క్లీన్ కామెడీ, మతిమరుపు ప్రేమికుడి పాట్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది.

