
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, మరోవైపు సున్నితమైన భావోద్వేగాలున్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది కాలం క్రితం చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు తీసినట్టు కనిపించిన ఆయన, తాజాగా వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు.
ఈమధ్యే ‘కేరింత’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దిల్‌రాజు, సెప్టెంబర్ 24కు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను ఫిక్స్ చేశారు. ఇక ఆ తర్వాత సునీల్ కృష్ణాష్టమి, సాయిధరమ్ తేజ్-అనిల్ రావిపూడిల సినిమా, బెంగళూర్ డేస్ రీమేక్.. ఇలా వరుస సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇక టైటిల్స్ విషయంలో మొదట్నుంచీ తనదైన బ్రాండ్ సెట్ చేస్తూ వస్తోన్న దిల్‌రాజు, తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో పలు ఆసక్తికర టైటిల్స్‌ను నమోదు చేయించారు. ‘జనగణమన’, ‘ఎవడో ఒకడు’, ‘సుప్రీమ్’ ఇలా మూడు సరికొత్త టైటిల్స్‌ను రిజిష్టర్ చేయించారు. ఈ టైటిల్స్ ఏయే సినిమాకు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రమోషన్స్‌తో దిల్‌రాజు బిజీగా ఉన్నారు.

