
‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్స్‌బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన కుటుంబ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్‍తో ‘బ్రహ్మోత్సవం’ కోసం మరోసారి జతకట్టారు. పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తోంది. సెప్టెంబర్ ౧౬న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలైన రోజున ఈ సినిమా షూటింగ్‍ను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
భారీ తారాగణంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. సంగీత్ నేపథ్యంలో వచ్చే ఈ పాట కోసం స్పెషల్‌గా వేసిన పెద్ద సెట్లో హీరో మహేష్ బాబు, హీరోయిన్లలో ఒకరైన ప్రణీత్, నరేష్, రావు రమేష్, జయసుధ, తులసి.. ఇలా భారీ తారాగణం పాల్గొంటుండగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి ఆసక్తి కనిపిస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్లో మరో గుర్తుండిపోయే ఒక సినిమాలా నిలబడుతుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

