హైదరాబాద్‌లోని సిటాడెల్ హోటల్‌లో ‘వా ది ఓజీస్ టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో’ కర్టెన్‌రైజర్ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కోటి, చేతన్ భరద్వాజ్, దర్శకుడు జ్ఞానశేఖర్ పాల్గొన్నారు. నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి మార్గదర్శకత్వంలో ఈ సంగీత వినోద కార్యక్రమాన్ని రూపొందించారు.
మే 17 ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ భారీ అంత్యాక్షరి పోటీ జరగనుంది. సింగర్ రేవంత్, నిహారికలు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ఐపీఎల్ తరహాలో 6 సెలబ్రిటీ జట్లు ఈ పోటీలో తలపడతాయి. ప్రముఖ బ్రాండ్ల ప్రతినిధులు ఓనర్లుగా, ఐకానిక్ సింగర్స్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ప్రణవం, చరణం, మధురం, వసంతం, నాదం, శ్రవణం పేర్లతో ఉన్న ఈ ఆరు జట్లకు ఎస్.పీ. శైలజ, మల్లికార్జున్, గీతా మాధురి, కారుణ్య, కల్పన, శ్రీకృష్ణ నాయకత్వం వహించనున్నారు. వీరితో పాటు రోహిత్, మాళవిక, దామిని తదితర యువ గాయకులు జట్లలో సందడి చేయనున్నారు.
సంగీత దిగ్గజం కోటి మాట్లాడుతూ.. “ఇంత సృజనాత్మకమైన సంగీత పోటీని ముందెన్నడూ వినలేదు” అని ప్రశంసించారు. ఏరో వాటర్, వరాహ గ్రూప్, ఫ్రీడమ్ ఆయిల్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థల స్పాన్సర్‌షిప్‌తో వస్తున్న ఈ షో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మ్యూజిక్ ఈవెంట్‌గా నిలవనుంది. ప్రేక్షకుల కోసం టికెట్లు బుక్‌మైషోలో అందుబాటులో ఉన్నాయి.


