
తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన మార్క్‌ను చూపెడుతూ, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ. పెళ్ళి తర్వాత పూర్తిగా సినిమాల్లో నటించడం మానేసిన ఆమె, ప్రస్తుతం కుటుంబంతో పాటు అమెరికాలో ఉంటున్నారు. ఇక నిన్న సాయంత్రం నుంచి నటి లయ, కారు ప్రమాదానికి గురయ్యారంటూ ఓ వార్త అంతటా హల్చల్ చేసింది. ఈ వార్త పలు ప్రధాన పత్రికల్లోనూ రావడంతో లయ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
కాగా తనకు ప్రమాదం జరిగినట్లు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని లయ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. తనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, హ్యాపీగా ఉన్నానని, ఇలాంటి వార్తలను ప్రసారం చేసేముందు ఒకసారి ఆలోచించుకొని, పరిశీలిస్తే బాగుంటుందని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇక ఈ పుకార్లు మొదలవ్వగానే తనకు ఇండియా నుంచి చాలామంది ఫోన్లు చేసి మాట్లాడారని, తనపై ప్రేమ చూపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి వార్తలతో ఎవ్వరినీ డిస్టర్బ్ చేయొద్దని విన్నవించుకున్నారు.

