
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమా ప్రస్తుతం తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ ఏడాది తమిళంలో భారీ అంచనాలతో విడుదలవుతోన్న సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఇక తమిళంలో సూపర్ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని భావించిన సినిమా యూనిట్, అందుకు తగ్గట్లుగానే తెలుగు డబ్బింగ్ పనులను కూడా వేగవంతం చేసింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా కావడం, అజిత్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించడం వంటి విషయాలు ఈ సినిమాకు తెలుగులో ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక తెలుగులో ఈ సినిమాకు ‘ఆవేశం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తమిళ వర్షన్‌తో పాటే తెలుగు వర్షన్‌నూ దీపావళి కానుకగానే విడుదల చేయాలని సినిమా నిర్మాత భావిస్తున్నారట. తెలుగులో గోపీచంద్‌తో శౌర్యం లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకుడు. జిల్ సినిమాతో మెప్పించిన కబీర్ సింగ్ వేదాళంలో విలన్‌గా నటించారు.

