
ఈ ఏడాది శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రానున్న నెక్స్ట్ మూవీ ‘బ్రహ్మోత్సవం’. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మహేష్ బాబు పారిస్ నుంచి రాగానే ఊటీలో ప్రారంభం కానుంది. ఇది కాకుండా మహేష్ బాబు ఎఆర్ మురుగదాస్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి పలు ఆసక్తికర విషయాలను మీకు అందజేస్తూనే ఉన్నాం. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని మీకందిస్తున్నాం..
శ్రీమంతుడు సినిమా నుంచి తమిళ చిత్ర సీమపై కూడా దృష్టి పెట్టిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాని ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో షూట్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే మురుగదాస్ సినిమాతో హిందీలో కూడా తన సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమాకి మురుగదాస్ సోషల్ మెసేజ్ తో కూడుకున్న యూనివర్సల్ కాన్సెప్ట్ కథని సిద్దం చేస్తున్నాడు. కావున ఆ సినిమాకి బాలీవుడ్ లో కూడా రీచ్ ఉంటుందని, అలాగే మురుగదాస్ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. దాంతో మహేష్ బాబు – మురుగదాస్ సినిమాని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 12న లాంచ్ కానున్న ఈ సినిమాని ఎన్.వి ప్రసాద్ – ఠాగూర్ మధులు కలిసి నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు నటీనటుల్ని, టెక్నికల్ టీంని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

