అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన అప్పట్లో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు దీపావళి కానుకగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండడంతో అఖిల్ టీమ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌ను చివరిదశకు చేర్చింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అఖిల్ సినిమా కోసం స్పెషల్ ఫ్యాన్స్ షోకు కూడా అన్ని ఏర్పాట్లూ పూర్తి కావచ్చాయి. నవంబర్ 10 అర్థరాత్రి నుంచే అన్నిచోట్లా ఫ్యాన్స్ షోస్ మొదలుకానున్నాయి. ఈ షోస్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో అఖిల్, నితిన్, వీవీ వినాయక్ అంతా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నారు. అఖిల్ గ్రాండ్ ఎంట్రీ సినిమా అభిమానులకు నచ్చే సినిమాగా తప్పకుండా నిలుస్తుందన్న ధీమాను అఖిల్ టీమ్ వ్యక్తం చేస్తోంది. ఇక దీపావళి సీజన్‌కు అఖిల్ సోలో రిలీజ్‌తో సిద్ధమవ్వడం అఖిల్‌కు కలిసివచ్చే అంశమనే చెప్పవచ్చు.


