సిద్ధార్థ్.. తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు ప్రధాన సినీ పరిశ్రమల్లో నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇక గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తమిళంలో విభిన్న చిత్రాలతో వెళుతున్న సిద్ధార్థ్ తాజాగా ‘జిల్ జంగ్ జక్’ పేరుతో ఓ సరికొత్త ప్రయోగంతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. సిద్ధార్థ్ తన సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమాకు దీరజ్ వైడి దర్శకత్వం వహించారు. ఇక ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ఆడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
డార్క్ కామెడీ జానర్లో మన దగ్గర చాలా తక్కువ సినిమాలే వచ్చిన పరిస్థితుల్లో ‘జిల్ జంగ్ జక్’పై తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నట్లు సిద్ధార్థ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ సినిమాలో సిద్ధార్ లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక 2012లో ‘లఫ్ ఫెయిల్యూర్’ అనే ద్విభాషా చిత్రంతో నిర్మాతగా మారిన సిద్ధార్థ్, మళ్ళీ మూడేళ్ళకు తన సొంత బ్యానర్లో చేసిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆకట్టుకుంటుదన్న నమ్మకాన్ని సిద్ధార్థ్ వెలిబుచ్చారు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు సిద్ధార్థ్ సన్నాహాలు చేస్తున్నారు.


