బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడు’కి 100 రోజులు..!

బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడు’కి 100 రోజులు..!

Published on Nov 14, 2015 2:33 AM IST

srimanthudu

‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించి చూపిన సినిమా. ఆగష్టు 7న, మహేష్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు మొదలైన ‘శ్రీమంతుడు’ సంబరం బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టి నేటితో 100రోజులు పూర్తి చేసుకుంది. సినిమాల ద్వారా ఏదైనా బలమైన భావోద్వేగాన్ని చెప్పాలని ఎప్పుడూ భావించే దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమా ద్వారా ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే అంశాన్ని సున్నితమైన కుటుంబ భావోద్వేగం, కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించారు. కొరటాల శివ చేసిన ఈ ప్రయోగమే ‘శ్రీమంతుడు’ని బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిపింది.

ఇక మహేష్‌కి సైతం ఈ సినిమా నటుడిగానే కాకుండా ఓ వ్యక్తిగానూ ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సినిమాలో చేసినట్లుగానే నిజ జీవితంలోనూ రెండు ఊర్లను దత్తత తీసుకొని మహేష్ రీల్ మరియి రియల్ హీరో అనిపించుకోవడం శ్రీమంతుడు సినిమాతోనే సాధ్యమైంది. ఇక ఈ సినిమా ద్వారా స్ఫూర్తి పొందిన పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌ను అందరికీ మరింత చేరువ చేసేందుకు తమవంతు కృషి చేశారు. దీంతో ‘శ్రీమంతుడు’ని మహేష్ తన కెరీర్లో స్పెషల్ సినిమాగా ప్రస్తావిస్తూ వచ్చారు. నేటితో ఈ సినిమా 15 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది.

శ్రీమంతుడు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు అన్నిచోట్లా స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో సంబరాలు చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. సోషల్ మీడియాలో ఇప్పటికే శ్రీమంతుడు వంద రోజులు పూర్తి చేసుకుందన్న అంశాన్ని ట్రెండింగ్‌గా నిలుపుతూ ఫ్యాన్స్ ఖుషీ చేస్తున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు