
యంగ్ టైగర్ ఎన్టీఆర్, విలక్షణ దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వచ్చింది. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను కూడా దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా లండన్, స్పెయిన్‌లలోని అద్భుతమైన లొకేషన్స్‌తో మ్యాజిక్ చేయనుంది.
ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. సుకుమార్-దేవిశ్రీ-ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తోన్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఆడియోపై మంచి అంచనాలు ఉన్నాయని, అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆడియో ఉంటుందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఇక సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్లో పాపులర్ అయిన ఐటెమ్ సాంగ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోందీ? అన్న ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ‘నాన్నకు ప్రేమతో’లో మంచి మాస్ నంబర్ ఉందని, అది ఆడియోకు హైలైట్‌గా నిలుస్తుందని దేవిశ్రీ తెలిపారు. సుకుమార్ అందించిన అద్భుతమైన కథే నాన్నకు ప్రేమతో సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దేవిశ్రీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

