విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్ జీవితకథను దర్శకుడు క్రిష్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ నటిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తారీఖునే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఆ దశగా ఇప్పటి నుంచే మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ తొలిసారి సీఎంగా జనవరి 9న ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 2019 జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్ విడుదలవుతుంది.
ఈ చిత్ర రెగ్యులర్ షూట్ జూలైలో మొదలవ్వబోతుంది. మూడు నెలల్లో టాకీ పార్ట్ పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా వినిపించారని అవి చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


