పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కాస్త బిడియం ఎక్కువని ఆయనతో సన్నిహితంగా మెలిగిన చాలామంది చెప్పారు. కొన్ని సందర్భాల్లో స్వయంగా ఆయనే చెప్పారు. ఐతే ఆదివారం వైజాగ్ లో జనసేన నిరసన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ చిత్రం షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తన అభిమానులతో పంచుకున్నారు.
‘సినిమాల్లోకొచ్చిన కొత్తలో నాకు బిడియం కాస్త ఎక్కువగా ఉండేది. ‘సుస్వాగతం’ షూటింగ్ సమయంలో నా పై ఓ సాంగ్ ను తీస్తున్నారు. సన్నివేశం ఏమిటంటే వేలాది మంది చూస్తుండగా బస్సు మీదకి ఎక్కి నేను డ్యాన్స్ చేయాలి. దాంతో నాకున్న బిడియం వల్ల నేను చాలా భయపడిపోయాను. నాకేం అర్ధంకాక మా వదిన సురేఖగారికి ఫోన్ చేసి ఈ సినిమాలు నాకు సరిపోవని అన్నాను. ఆ భయంలో ఆమెతో నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాను’ అని పవన్ తెలిపారు.


