బన్నీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఐతే ప్రస్తుతం త్రివిక్రమ్ జూ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ తో త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేసి, దసరా సందర్భంగా అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.
అయితే ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయం మీద ఇప్పుడు బన్నీ అభిమానుల్లో ఆసక్తి ఎక్కువయింది . కాగా గతంలోనే బన్నీ, త్రివిక్రమ్ ఓ సినిమా చేద్దామనుకున్నారు. ఆ సినిమా ఈ ఏడాది చివర్లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి మంచి విజయాలు సాధించిన చిత్రాలు వచ్చాయి. మరి మూడో సినిమా కూడా వస్తే అది కూడా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.


