‘మా’ నిధుల గోల్‌మాల్‌ పై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ త‌ప్ప‌నిసరి – సీనియ‌ర్ న‌రేష్‌

‘మా’ నిధుల గోల్‌మాల్‌ పై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ త‌ప్ప‌నిసరి – సీనియ‌ర్ న‌రేష్‌

Published on Sep 4, 2018 3:55 AM IST

Naresh

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ న‌టీన‌టుల‌ సంఘం(మా) నిధుల గోల్‌మాల్‌ పై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేయాల‌ని సీనియ‌ర్ న‌రేష్ డిమాండ్ చేశారు. 5.50 కోట్ల నిధులు ఉన్న సంస్థ మా అసోసియేష‌న్. ఇలాంటి చోట త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు దాని పై హైయ్య‌ర్ క‌మిటీని వేసి నిజాలేంటో తేల్చాల‌ని డిమాండ్ చేశారు. అందుకోసం రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, జ‌డ్జీల‌తో ఓ క‌మిటీ వేయాల‌ని, మా అసోసియేష‌న్‌లో వారినే క‌మిటీగా వేస్తే అందులో పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌ద‌ని అన్నారు. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ స‌భ్యుడిగా ప‌ర‌ద‌ర్శ‌క‌త ఉన్న‌వాడిగా నేను ఇది డిమాండ్ చేస్తున్నాన‌ని అన్నారు న‌రేష్‌.

కాగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ లో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరంచ‌డం త‌న‌కు భ‌యం క‌లిగించింద‌ని అన్నారు. తన తల్లి విజయ నిర్మల పుట్టిన రోజున ప్ర‌తియేటా రూ.75వేలు ఇస్తున్నారని, ఇప్ప‌టికే రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా మెంబ‌ర్స్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక పేరుతో బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ తో అమెరికా వెళ్లడం దారుణమని అన్నారు. అసోసియేష‌న్ నిధులు మాయ‌మైన‌ప్ప‌టి నుంచి శివాజీ రాజా క‌నిపించ‌డం లేద‌ని, దీనికి స‌మాధానం ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. రికార్డుల్ని ఎందుకు చెరిపేసే ప్రయత్నం చేశార‌ని నిల‌దీశారు. రికార్డుల‌న్నీ ప‌రిశీలించేందుకు నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ త‌ప్ప‌నిస‌రని అన్నారు.

గ‌త కొంత‌కాలంగా త‌న‌ను క‌మిటీ దూరం పెట్ట‌డం వెన‌క కార‌ణ‌మేంటో తెలియ‌ద‌ని అన్నారు. శివాజీరాజా అత‌డి బృందం త‌ప్పు చేశార‌ని నేను పూర్తిగా నింద వేయ‌ను. సందేహ నివృత్తి చేయాలి. నిజ‌నిర్ధారణ చేయాల్సిన బాధ్య‌త ఉంది. అంత పెద్ద నిధి ఉన్న‌ప్పుడు డ‌బ్బు దుర్వినియోగం చేయ‌డంపై అంద‌రికీ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని అన్నారు. నేటి సాయంత్రం తెలుగు నిర్మాత‌ల మండ‌లి హాల్‌ లో జ‌రిగిన లైవ్ కార్య‌క్ర‌మంలో న‌రేష్ పై విధంగా డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో మెగాస్టార్ ఎంతో హుందాగా వ్య‌వ‌హ‌రించార‌ని, పెద్ద‌లు కూచుని మాట్లాడాల్సి ఉంద‌ని అన్నార‌ని న‌రేష్ తెలిపారు.

తాజా వార్తలు