ఎన్టీఆర్ బయోపిక్ లో తెలంగాణ ముఖ్యమంత్రి !
Published on Sep 12, 2018 5:29 pm IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో లెజెండరీ పాత్ర ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే తెలాంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. అసలు కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే. స్వతహాగా ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన కేసీఆర్, ఆయన కుమారుడి పేరు కూడా తారక రామారావు అని.. ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నారు. అంతటి అభిమానం ఉంది గనుకనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన వెంటనే కేసీఆర్ ఆ పార్టీ కోసం పని చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో.. ఓ జాతరలో కేసీఆర్ మొదటిసారిగా ఎన్టీఆర్ ని కలుసుకున్నట్లు, తన వెంట తన కుమారుడిని కూడా తీసుకువెళ్లి, ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నట్లు బయోపిక్ లో చూపించనున్నారు. అయితే కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారో తెలియాల్సి ఉంది. దర్శక నిర్మాతల ఆలోచన ప్రకారం కేసీఆర్ పాత్రలో పేరు ప్రఖ్యాతలు ఉన్న నటుడినే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

  • 16
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook