తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు కన్నుమూశారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభింరు. ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ లు వేయడం, వారిని అనుకరించి మాట్లాడటం వేణు మాధవ్ చిన్నప్పటి నుండి చేస్తుండేవారు. అలా ఆయన తన ప్రదర్శనలతో మహానాడులో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. మొదటిసారి వేణుమాధవ్ ప్రదర్శనను చూసిన ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నారు. అలా వేణు మాధవ్ కు తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అండ లభించింది.
ఇక వేణు మాధవ్ మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘సాంప్రదాయం’. అయితే తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పై ఆయన చెప్పిన చాటభారతమంత డైలాగ్ ఆయన్ను ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది. ఆ తరువాత దిల్ సినిమాతోనూ ఆయనకు మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇంకా ఆయనకు పేరు తెచ్చిన సినిమాలు సై, ఛత్రపతి, మొదలైనవి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపదుంచుకుని వెళ్లిపోయారు వేణుమాధవ్. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖులు చాలామంది ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


