తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖులు చాలామంది ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వేణుమాధవ్ మృతి పై స్పందిస్తూ.. ‘ వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి మాస్టర్ సినిమాలో నటించాడు. అటు పై పలు సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా నటించేవాడు. ఆ పాత్రకే వన్నెతీసుకొచ్చే వాడు. వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందని అనుకునే వాడిని. కానీ దేవుడు చిన్న చూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అన్నారు.
వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభింరు. ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ లు వేయడం, ఎన్టీఆర్ ని అనుకరించి మాట్లాడటం, వేణు మాధవ్ చిన్నప్పటి నుండి చేస్తుండేవారు. అలా ఆయన తన ప్రదర్శనలతో మహానాడులో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మరణం విచారకరమని, ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసి ప్రత్యేకతను చాటుకున్నారని అంటూ సానుభూతిని వ్యక్తం చేశారు.


