చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ మాత్రమే సుదీర్ఘ కాలం నిలిచి వుంటారు. చాలా మంచి హీరోయిన్స్ అలా వెలిగి ఇలా కనుమరుగవడుతుంటారు. సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో అన్ని వేళలా అవకాశాలు అంది పుచ్చుకోవడం తారలకు అంత తేలికేమి కాదు. తమన్నా లాంటి కొందరు హీరోయిన్స్ మాత్రమే మేము వాటికి అతీతులమని నిరూపించుకుంటున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో వచ్చిన శ్రీ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ ఆమెకు మొదటి విజయాన్ని అందించింది. ఐతే 2010లో విడుదలైన 100% లవ్ మూవీ ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తరువాత స్టార్ హీరోల హాట్ ఫేవరెట్ గా తమన్నా మారిపోయింది. టాలీవుడ్ లోని అందరు టాప్ స్టార్స్ సరసన నటించిన తమన్నా బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం.
ఇక ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె తెలుగు తమిళ హిందీ భాషలలో కలిపి 7చిత్రాల వరకు నటిస్తున్నారు. వీటిలో చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం సైరా కూడా ఉండటం విశేషం. తమిళంలో విశాల్ సరసన యాక్షన్ చిత్రంలో నటిస్తున్న ఈమె గోపీచంద్-సంపత్ నంది చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. తమన్నా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 14ఏళ్ళు అవుతున్నా ఇలా యంగ్ హీరోయిన్స్ తో పోటీపడుతూ అవకాశాలు దక్కించుకోవడం విశేషం.


