మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు మరి కొన్ని గంటల్లో రాబోతుంది. సైరా టికెట్స్ కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి అదనపు షోలకు అనుమతి ఇచ్చాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపి ప్రభుత్వం రోజుకు 6 షోలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో ఐదు షోలను ప్రసారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దాంతో రేపు ఉదయం 7 గంటలకే హైదరాబాద్ లో అలాగే తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో సైరా షో పడనుంది.
ఇక భారీ అంచనాలతో గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది సైరా. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.


