శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో, శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ పతాకంపై మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రూపొందుతుండగా, దివంగత శ్రీహరి జయంతి సందర్భంగా శనివారం దీని ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేశారు. కాగడా పట్టుకున్న మేఘాంశ్, విలక్షణమైన బొట్టు ఉన్న ఒక పెద్ద అరచేతి మధ్యలో నిలబడిన దృశ్యాలు మోషన్ పోస్టర్‌లో ఆకట్టుకుంటూ, ఆ అరచేయి ఎవరిదనే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచుతున్నాయి.
శాంతి శ్రీహరి మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ చిత్రంలో మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న దర్శకుడికి, నమ్మకంతో నిర్మిస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీహరి గారి లాగే మేఘాంశ్ కూడా పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి నటిస్తున్నాడు. పోస్టర్‌లో మేఘాంశ్‌ని చూస్తుంటే సింహాన్ని చూసినట్టు. ఓ తల్లిగా ఈ సినిమాతో అతనికి మంచి విజయం అందాలని ఆకాంక్షిస్తున్న.’ అని అన్నారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. ‘‘ఆస్మాన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు రామ్‌తో పనిచేయడం గొప్ప అనుభవమిచ్చింది. ఆయన సెట్‌ను ఎప్పుడూ ఒక పండుగలా ఉంచుతారు. ఈ సినిమాలో రాయంచ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రశాంత్ అందించిన ఆకట్టుకునే బిజిఎమ్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మిగతా వివరాలను రాబోయే ప్రచార కార్యక్రమాల్లో వెల్లడిస్తాను.’ అని అన్నారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్మాన్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తూ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్, హీరో మేఘాంశ్ మరియు విజువల్స్ అందించిన షోయబ్‌లకు ధన్యవాదాలు. మేఘాంశ్ నిజ జీవితంలో కూడా రియల్ హీరో. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను పంచుకుంటాము.’ అని అన్నారు.
నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘ఆస్మాన్’ పోస్టర్ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ సినిమా కోసం మేఘాంశ్ ట్రాన్స్‌ఫార్మర్‌లా రూపుమార్చుకుని తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సెట్‌లో సమయపాలన పాటిస్తూ ఆయన చూపించిన క్రమశిక్షణ ‘రియల్ స్టార్’ శ్రీహరి గారి వారసత్వాన్ని గుర్తుచేసింది. ఈ సినిమా పయనంలో సపోర్ట్‌గా నిలిచిన డిస్కో శాంతి గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రాయంచ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, కెమెరామెన్ షోయబ్, నటుడు రవి వర్మ తదితరులు పాల్గొని మాట్లాడారు.



