‘అల వైకుంఠపురములో’.. ఎర్లీ దీపావళి !

‘అల వైకుంఠపురములో’.. ఎర్లీ దీపావళి !

Published on Oct 24, 2019 8:15 PM IST

Ala Vaikunthapuramulo1

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో చెప్పనక్కర్లేదు. అందుకు నిదర్శనమే ఆ చిత్రంలోని ‘సామజవరగమన’ పాట సాధించిన విజయం. గత నెల 27న విడుదలైన ఈ ప్రమోషనల్ సాంగ్ శ్రోతలను చాలా గొప్పగా ఆకట్టుకుంది.

అద్భుతమైన సిరివెన్నెల సాహిత్యం, ఫ్రెష్ ఫీల్ కలిగిన తమన్ సంగీతం, వినసొంపైన సిడ్ శ్రీరామ్ గాత్రం వెరసి ప్రేక్షకుల్ని పాటకు అడిక్ట్ అయ్యేలా చేశాయి. ఫలితంగా నెల రోజులు కూడా కాకముందే 50 మిలియన్ల వ్యూస్ దక్కాయి పాటకు. అలాగే 7.75 లక్షల లైక్స్ కూడా. ఇప్పటికీ పాట యూట్యూబ్ మాధ్యమంలో ట్రెండ్ అవుతూనే ఉంది.

సినిమాను హైప్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చిత్ర టీమ్ ఈ పాటతో చేసిన ప్రయత్నం పూర్తిగా ఫలించింది. ఈ విజయంతో తమకు దీపావళి ముందుగానే వచ్చిందని చిత్ర టీమ్ సంబరపడిపోతోంది. ఇకపోతే చిత్రం నుండి మరొక పాట ‘రాములో రాముల’ ఇంకో రెండు మూడు రోజుల్లో విదలకానుంది.

తాజా వార్తలు