
ఈ ఏడాది ఇలా ఉంటుంది అని అసలు ఎప్పుడు ఎవరు అనుకొని ఉండరు. కరోనా దెబ్బకు ఒక్కసారిగా ప్రపంచం అంతా స్తంభించినట్టయ్యింది. దీని ఎఫెక్ట్ ఇంకా అలా కొనసాగుతున్నప్పటికీ ప్రపంచం కూడా అలానే అలవాటు చేసుకుంది. అయితే ఈ కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ మూలాన ఆదిత్యధికంగా నష్టపోయింది మాత్రం సినిమా పరిశ్రమే అని చెప్పాలి.
అందులో ఒక భాగం అయినటువంటి థియేటర్స్ సంస్థకే భారీ స్థాయి నష్టం వాటిల్లింది. దీనితో ఈ గ్యాప్ ను ఓటిటి రంగం భర్తీ చేసింది. అప్పట్లో అంటే లాక్ డౌన్ మూలాన ఓటిటి హవా ఒక రేంజ్ లో ఎదిగి ఊహించని మార్పులు సొంతం చేసుకుంది. డైరెక్ట్ గా సినిమాలు విడుదలతో ఆ సమయంల పెద్ద రచ్చే నడిచింది.
ఇక ఏదోలా థియేటర్స్ తెరుచుకోడానికి అనుమతులు వచ్చాక కూడా ఇంకా ఓటిటికి ఆదరణ తగ్గకపోగా పెరడగం ఆశ్చర్యకరం. ఎందుకంటే వచ్చే అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవచ్చని భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా థియేటర్స్ వారు ఊపిరి పీల్చుకున్నారు.
అలా ప్రకటించిన ఈ కొన్ని రోజుల్లోనే మొత్తం 5 భాషల్లో 9 సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అంటూ అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించారు. ఇక కేవలం ఇదే కాకుండా ఇతర స్ట్రీమింగ్ సంస్థల్లో కూడా మరిన్ని చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఇది దేనికి సంకేతమో పాలు పోకుండా ఉంది. మళ్ళీ థియేటర్స్ పూర్వ వైభవం తెచ్చుకునేది ఎప్పుడా అని చాలా మంది ఫిల్మ్ లవర్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ సహా స్టార్ నటులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

