సోషల్ మీడియాలో నెటిజన్లు అప్పుడప్పుడు నోరుజారీ సెలబ్రిటీల ఆగ్రహానికి గురవుతుంటారు. నొప్పించే కామెంట్స్ వచ్చినప్పుడు బాధనిపించినా కొందరు స్టార్లు మౌనంగానే భరిస్తుంటారు. కానీ కొందరు మాత్రం గట్టి సమాధానం ఇచ్చి పిచ్చి కామెంట్లు చేసినవారి కళ్ళు తెరిపిస్తుంటారు. నటుడు మాధవన్ ఇప్పుడదే చేశారు. బాలీవుడ్ నటుడు అమిత్ సాద్ మాధవన్ తో కలిసున్న ఫోటో ఒకదాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్ని చూసిన ఒక నెటిజన్ ‘మాధవన్ అంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆయన డ్రగ్స్, మద్యానికి బానిసై ఇలా కావడం బాధగా ఉంది. బాలీవుడ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఆయన ముఖం, కళ్ళే చెబుతున్నాయి అంతా’ అంటూ కామెంట్ పెట్టింది.
అది చూసిన మ్యాడీకి పిచ్చ కోపం వచ్చినట్టుంది. అయినా కోపాన్ని ప్రదర్శించకుండా వ్యంగ్యంగా గట్టి సమాధానం ఇచ్చారు. ‘ఓహో.. ఇదన్నమాట మీరు కనుగొన్నది. పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు వీలైనంత త్వరగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం మంచిది’ అన్నారు. మ్యాడీ ఇచ్చిన సమాధానాన్ని చాలామంది నెటిజన్లు సపోర్ట్ చేశారు. స్టార్ల మీద అనుచిత కామెంట్లు చేయడం ట్రెండ్ అయిపోయింది. ఇలాంటివి తగ్గిస్తే మంచిది అంటున్నారు. ఇకపోతే మాధవన్ నటించిన కొత్త చిత్రం ‘మారా’ చిత్రం జనవరి 8న అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘చార్లీ’కి ఇది రీమేక్.


