మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. సినిమా మీద భారీ అంచనాలున్నాయి ప్రేక్షకుల్లో. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ రికార్డ్ స్థాయిలో జరిగింది. చిరు గత సినిమాలు అన్నింటికంటే ఎక్కువగానే జరిగింది. మే 13న విడుదల తేదీగా నిర్ణయించడంతో మెగాస్టార్ సహా బృందం మొత్తం రెస్ట్ లేకుండా కష్టపడుతోంది. అయితే పని ఒత్తిడి మూలాన చిరు కొంత నీరసించారు. ఈ వార్త బయటకు రాగానే సినిమా విడుదల మీద అనుమానాలు మొదలయ్యాయి.
చిరు విశ్రాంతి తీసుకుంటే ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు రారని, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాదని, విడుదల తేదీ మారుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి మాటల్ని బట్టి సినిమా వాయిదాపడే అవకాశమే లేదని తెలుస్తోంది. తాజాగా సినిమా ప్రోగ్రెస్ గురించి మాట్లాడిన ఆయన ఖమ్మం షెడ్యూల్ విజయవంతంగా ముగించామని, ఇందులో చిరు, చరణ్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించామని అంటూ మే 13న విడుదల ఖాయమని క్లారిటీ ఇచ్చారు. దీన్నిబట్టి సినిమా వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.


