సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు.
చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. జూన్ 12న విడుదల కానున్న “హరిహరవీరమల్లు” చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం, కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని, చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను ఉపేక్షించమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.


