ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఛాంపియన్’. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో తెలుగు తెరకు పరిచయం కావడం తన అదృష్టమని అనస్వర తెలిపారు. తనకు తెలుగు భాష రాకపోయినా, దర్శకుడు ప్రదీప్ సహకారంతో డైలాగ్స్ పలికానని, ఇందులో తాను పోషించిన ‘చంద్రకళ’ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ సినిమా కావడం, ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ ధరించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు.
హీరో రోషన్ అద్భుతమైన డ్యాన్సర్ అని, ‘గిరగిర’ పాట చిత్రీకరణలో ఆయన నుంచి కొన్ని డ్యాన్స్ మెలకువలు నేర్చుకున్నానని అనస్వర తెలిపారు. నిర్మాత స్వప్న దత్ తనకు అక్కలాగా అండగా నిలిచారని చెప్పారు. ఇక రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, తాను ‘మగధీర’ సినిమాను ఎన్నోసార్లు చూశానని గుర్తుచేసుకున్నారు. తెలుగులో అల్లు అర్జున్ తన అభిమాన హీరో అని, హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని తెలిపిన అనస్వర, ప్రస్తుతం ‘ఇట్లు మీ అర్జున’ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు.


