విడుదల తేదీ : డిసెంబర్ 28, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రాజీవ్ కనకాల, స్వరూప్ సంజయ్, సుగి విజయ్, రాధ్య తదితరులు
దర్శకుడు : సాయి కిరణ్ సుంకోజు
నిర్మాణం : ఆర్ ఆర్ టాకీస్
సంగీతం : శశాంక్ భాస్కరుణి
ఛాయాగ్రహణం : పి. కళ్యాణ్ కుమార్
కూర్పు : శ్రీకాంత్ పట్నాయక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ నుంచి కథా సుధ కొత్త ఎపిసోడ్ గా వచ్చిన తాజా లఘు చిత్రమే ‘అస్మి’. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన టాలెంట్ తో మంచి దర్శకుడు కావాలి అని కలలు కంటూ ఉంటాడు విక్రమ్ (స్వరూప్ సంజయ్) అలాగే తన ఇంట్లోనే తనతో పాటుగా మరో దర్శకుడు కాకపోతే ఒక సీనియర్ అండ్ ఫెయిల్యూర్ దర్శకుడు (రాజీవ్ కనకాల) కూడా తనతో ఉంటాడు. కళ అంటే అతనికి ప్రాణం, దర్శకుడు అంటే తాను నమ్ముకున్న కథ కోసం ఇలానే ఉండాలి అనే పట్టు తనది కానీ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండాలని విక్రమ్ భావిస్తాడు. ఇలా ఓ రోజు మంచి అవకాశం విక్రమ్ కి వచ్చి చేజారిపోతుంది అనే సమయంలో రాజీవ్ పాత్ర ఏం చేసింది? అసలు ఈ ఇద్దరూ తమతో ఇంకో పిల్లాడు ఎందుకు కలిసి ఉంటున్నారు? ఆ ఇద్దరూ ఎందుకు రాజీవ్ కి కనీసం మర్యాద ఇవ్వరు? చివరిగా రివీల్ అయ్యిన షాకింగ్ నిజం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఆ మధ్య కాలంలో చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమా చూసిన కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా గుర్తుంది కదా అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ క్లైమాక్స్ తో ఓ సినిమా ముగించడం అనేది ఒకింత కత్తి మీద సాము లాంటిదే కానీ అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ఊహించని ఎండింగ్ ఇందులో సర్ప్రైజ్ చేస్తుంది.
రాజీవ్ ఇంకా యువ నటుడు స్వరూప్ సంజయ్ లు పోటీపడి నటించారు. సింగిల్ టేక్ లో లెంగ్త్ డైలాగ్స్ లాంటివి చెప్పి ఆశ్చర్యపరుస్తారు. వీరిద్దరి నడుమ కొన్ని సీన్స్ అలాగే ఎమోషనల్ పార్ట్ ఇందులో బాగుంది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా వీక్షకులని ఒకింత థ్రిల్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ ఇందులో కొన్ని సన్నివేశాలు ఏమాత్రం అంచనా లేకుండా చూసేవారికి అంత రుచించకపోవచ్చు. మెయిన్ గా రాజీవ్ పాత్రని కనీస మర్యాద లేకుండా చిన్న పిల్లాడు, యువకుడు పాత్రలు మాట్లాడ్డం వంటివి వారికి నచ్చకపోవచ్చు.
ఇవి ఎందుకు పెట్టారు అనేది క్లైమాక్స్ లో ఒక మీనింగ్ ఫుల్ ఎండింగ్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో అంటే అందరి వల్ల కాకపోవచ్చు. అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా ఇందులో ఒకింత చికాకు తెప్పిస్తుంది. ఆ సాఫ్ట్ వాయిస్ డబ్బింగ్, పూర్తిగా ఆమె ట్రాక్ ఈ సబ్జెక్టులో అంత సరిగ్గా ఇమడలేదు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ఎమోషన్ కి తగ్గట్టుగా తీసుకున్న కెమెరా అండ్ మ్యూజిక్ వర్క్స్ ఇందులో మెప్పించే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.
ఇక దర్శకుడు సాయి కిరణ్ సుంకోజు విషయానికి వస్తే.. ఒక ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ ని తాను ట్రై చేసారని చెప్పాలి. క్లైమాక్స్ లో ఒక ఊహించని ఎండింగ్ ట్విస్ట్ తో అల్లుకున్న కథనం బాగానే ఉంది కానీ అందరి ఆడియెన్స్ కి ఇది ఈక్వల్ గా చేరువ కాకపోవచ్చు. కొన్ని సీన్స్ ని ఇంకొంచెం సుకుమారంగా ప్లాన్ చేయాల్సింది. మరీ ‘రా, ఒరేయ్’ లాంటివి కాకుండా రాజీవ్ పాత్రని ఏక వచనంలోనే పిలిచే విధంగా మరో వెర్షన్ డైలాగ్స్ ప్రిపేర్ చేసుకోవాల్సింది. అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా అంత ఇంపాక్ట్ ఇందులో చూపించలేదు. ఇలాంటివి కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఇంకా గట్టిగా నాచురల్ గా ఉండేది. ఓవరాల్ గా తన వర్క్ బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అస్మి’ అనే లఘు చిత్రం కథా సుధా వీక్షకులని సర్ప్రైజ్ చేసి తీరుతుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న ఈ సబ్జెక్టు క్లైమాక్స్ కి వచ్చేసరికి కదిలిస్తుంది. కానీ మధ్యలో చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని కూడా కరెక్ట్ చేసుకొని ఉంటే ఈ సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. అయినప్పటికీ ఈ సినిమాని ఈటీవీ విన్ లో ట్రై చేయవచ్చు. వాచ్ ఇట్.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


