భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించిన జీ5 తెలుగు: బాలకృష్ణ, వెంకటేష్, నాగచైతన్య చిత్రాలతో పాటు సరికొత్త ఒరిజినల్స్

భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించిన జీ5 తెలుగు: బాలకృష్ణ, వెంకటేష్, నాగచైతన్య చిత్రాలతో పాటు సరికొత్త ఒరిజినల్స్

Published on Aug 30, 2026 1:35 AM IST

ముఖ్య అంశాలు

  • తెలుగు జీ5 ప్రముఖ నిర్మాణ సంస్థలతో చేతులు కలిపి భారీ సినిమాలు, ఒరిజినల్ సిరీస్‌లు, ఏఐ స్టోరీటెల్లింగ్‌తో కూడిన మెగా కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది.
  • బాలకృష్ణ ‘NBK111’, నాగ చైతన్య ‘వృషకర్మ’, వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబో చిత్రం, అఖిల్ ‘లెనిన్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లు జీ5 వేదికగా అలరించనున్నాయి.
  • నివేదా థామస్ ‘శ్రీమతి’, భరత్ నివాస్ ‘పంచనామా’ ఒరిజినల్స్‌తో పాటు జగపతి బాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ షో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలుగు జీ5 (ZEE5 Telugu) సరికొత్త ఒరిజినల్స్, భారీ చిత్రాలతో కూడిన మెగా కంటెంట్ లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని విస్తృతమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది.

స్టార్ హీరోల చిత్రాల సందడి

సినిమాల విభాగంలో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలోని ‘NBK111’తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రం జీ5 లైనప్‌లో చేరాయి. వీటితో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘వృషకర్మ’, మురళీ కిషోర్ అబ్బూరు–అఖిల్ అక్కినేని కాంబినేషన్ మూవీ ‘లెనిన్’, అల్లరి నరేష్ ‘కనక దుర్గ’ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అలాగే ‘డిమాంటీ కాలనీ 2’, ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.

ఆకట్టుకునే ఒరిజినల్స్, షోలు

ఒరిజినల్స్ విషయానికి వస్తే నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా కీలక పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’ సిరీస్‌లు రానున్నాయి. జగపతి బాబు హోస్ట్‌గా పాపులర్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ సందడి చేయనుంది.

వీటితో పాటు ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి సరికొత్త ఏఐ (AI) ఆధారిత స్టోరీటెల్లింగ్ కంటెంట్‌ను కూడా జీ5 అందుబాటులోకి తెస్తోంది. పిల్లల కోసం ప్రత్యేక యానిమేషన్ కంటెంట్‌తో పాటు ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌ను కూడా జీ5 అందించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు