తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) ను మొదటగా 2025 జనవరి 10న పొంగల్ స్పెషల్‌గా భారీ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే సినిమాలోని కొన్ని రాజకీయ అంశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల విషయంలో డైలమా ఏర్పడింది.
అయితే, ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపగా, ఎట్టకేలకు సెన్సార్ సమస్యలకు తెరపడింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ చిత్ర నిడివి 2 గంటలు 43 నిమిషాలుగా లక్ అయింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో, ముందుగా అనుకున్నట్టుగానే థియేటర్లలో సినిమా విడుదల కానుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్‌పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రానా దగ్గుబాటి, అథర్వ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ నిర్మించగా, జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


