ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’(Barabar Premistha). ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, చంద్రహాస్ కష్టపడే తత్వం ఉన్నవాడని, ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ రావాలని ఆకాంక్షించారు. టైటిల్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ చంద్రహాస్ ఆటిట్యూడ్‌కు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ పేర్కొన్నారు. చంద్రహాస్ జనాన్ని ఆకర్షించే వ్యక్తిత్వమున్నవాడని జేడీ చక్రవర్తి కొనియాడారు. తన తండ్రి ప్రభాకర్, హీరో ఆది తనకు స్ఫూర్తి అని చంద్రహాస్ తెలిపారు. లెక్కలేనన్ని ట్విస్ట్‌లతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని, ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుందని దర్శకుడు సంపత్ తెలిపారు. మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 6న థియేటర్లలో చూడాలని చిత్రబృందం కోరింది.


