కిరణ్ అబ్బవరం క్రేజీ సీక్వెల్ చిత్రం.. మార్పు ఖాయమా..?

కిరణ్ అబ్బవరం క్రేజీ సీక్వెల్ చిత్రం.. మార్పు ఖాయమా..?

Published on Feb 6, 2026 1:59 AM IST

KA

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ (KA) సీక్వెల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 2024 దీపావళి కానుకగా విడుదలై రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, వరుస ప్లాపుల్లో ఉన్న కిరణ్‌కు సాలిడ్ హిట్ ఇచ్చింది. అయితే, ఈ సినిమా రెండో భాగంలో కిరణ్ అబ్బవరం నటిస్తాడా లేదా అనే దానిపై ప్రస్తుతం అయోమయం నెలకొంది.

ఈ చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ఇటీవల తన తాజా చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘క’ సీక్వెల్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనికి కూడా సుజీత్-సందీప్ ద్వయమే దర్శకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. అయితే, హీరో విషయంలో మాత్రం దర్శకులే తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటూ, కథ డిమాండ్ చేస్తే హీరో మారే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇది కిరణ్ అబ్బవరం అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగం ముగింపులోనే సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇచ్చినప్పటికీ, అది అదే పాత్ర యొక్క కొనసాగింపా లేక సరికొత్త ప్లాట్‌తో రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది. కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్టులో కొనసాగుతారా లేదా అన్న దానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు