మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం జోర్డాన్ వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కనిపించిన రగ్గడ్ లుక్, గుబురు గడ్డం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జోర్డాన్ షెడ్యూల్లో సినిమాలోని కీలకమైన మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. మలయాళ స్టార్ టోవినో థామస్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. తొలుత సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలైన ‘దేవర 2’ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం సిద్ధమవుతున్నారు. అయితే వీటిలో ఏది ముందుగా పట్టాలెక్కుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


