నటి ప్రత్యూష మృతి కేసు: 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

నటి ప్రత్యూష మృతి కేసు: 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Published on Feb 17, 2026 12:37 PM IST

Pratyusha

టాలీవుడ్ నటి ప్రత్యూష (Pratyusha) మరణం కేసులో దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుప్రీంకోర్టు నేడు(ఫిబ్రవరి 17, 2026) తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. వచ్చే నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం అతడిని ఆదేశించింది.

2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ప్రత్యూష మరియు సిద్ధార్థ్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, ప్రత్యూష మరణించింది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్యేనని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె తల్లి సరోజినీ దేవి ఇన్నేళ్లుగా న్యాయపోరాటం చేశారు. కానీ, మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అత్యాచారం మరియు హత్య ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.

సెషన్స్ కోర్టు మొదట ఐదేళ్ల శిక్ష విధించగా, 2011లో హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ శిక్షా కాలాన్ని సవాలు చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి, శిక్ష పెంచాలని ప్రత్యూష తల్లి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేటి తీర్పుతో సిద్ధార్థ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం కాగా, రెండు దశాబ్దాల మిస్టరీ కేసు ఒక కొలిక్కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు