మాస్ రాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావాల్సి ఉన్నప్పటికీ, ఐదు వారాలు గడిచినా రాకపోవడంతో ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం అతిత్వరలో జీ5లో అందుబాటులోకి రానుంది.
డిజిటల్ రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను కూడా ఏడు భాషల్లో విడుదల చేసిన నేపథ్యంలో, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌లో ఆషికా రంగనాథ్ మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో మంచి వినోదాన్ని పంచిన ఈ చిత్రం, ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీలోకి రానుండటంతో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.


