కేజీయఫ్, కాంతార, సలార్ వంటి సంచలన చిత్రాలతో గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ‘హోంబలే ఫిల్మ్స్’, ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. ఇకపై కేవలం నిర్మాణ సంస్థ గానే కాకుండా, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ప్రభాస్‌తో ఇప్పటికే మూడు భారీ చిత్రాల ఒప్పందం చేసుకున్న ఈ బ్యానర్, తమ సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో విదేశాల్లోని భారతీయ ప్రేక్షకులకు సినిమాలను నేరుగా, వేగంగా చేరువ చేయనుంది.
ఒక క్రమపద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నిర్మించడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో తమ పట్టును మరింత పెంచుకోవాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ను ఏమాత్రం ఆలస్యం లేకుండా విడుదల చేయడం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ కేవలం హోంబలే సొంత సినిమాలకే పరిమితం కాదు. భారతదేశంలోని ఇతర నిర్మాణ సంస్థలు, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లు మరియు కంటెంట్ క్రియేటర్లకు కూడా హోంబలే తన గ్లోబల్ నెట్‌వర్క్‌ను అందుబాటులో ఉంచనుంది. తద్వారా, విదేశీ మార్కెట్లలో విడుదల చేయడానికి ఇబ్బంది పడే చిన్న మరియు మధ్య తరహా చిత్రాలకు కూడా ఈ సంస్థ ఒక పెద్ద భరోసాగా మారనుంది.


