- మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని, ఇండియాలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ( LPG gas shortage ) కొరత తీవ్రస్థాయికి చేరింది.
- సిలిండర్లు దొరక్కపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో వేలాది రెస్టారెంట్లు, చిన్నపాటి టిఫిన్ సెంటర్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.
- ఒకవేళ తిరిగి హోటళ్లు తెరిచినా, పెరిగిన గ్యాస్ రేట్లను కవర్ చేయడానికి ఫుడ్ ధరలను అమాంతం పెంచే అవకాశం కనిపిస్తోంది.
గత రెండు రోజులుగా నగరంలో ఎక్కడ చూసినా ఒకటే వార్త.. ‘హోటళ్లు మూతపడుతున్నాయి’ అని! కానీ, దీని వెనుక ఉన్న అసలు భయం సామాన్యుడి జేబుకు, కడుపుకు ఎలా తగలనుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బయటకెళ్లి బిర్యానీ లాగిద్దామనుకునే వాళ్లకు, ఆఫీస్‌కు వెళ్తూ దారిలో టిఫిన్ చేసే వాళ్లకు ఇది నిజంగా పెద్ద షాకే. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో ఇప్పుడు సిలిండర్ దొరకక, పొయ్యి వెలగక ఫుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఎక్కడో యుద్ధం.. ఇక్కడ కష్టాలు
అసలు మన దగ్గర గ్యాస్ ఎందుకు దొరకట్లేదు అని ఆరా తీస్తే.. కనెక్షన్ ఎక్కడో మిడిల్ ఈస్ట్‌కు (పశ్చిమాసియా) లింక్ అయి ఉంది. అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దాడుల కారణంగా గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇండియాకు రావాల్సిన గ్యాస్ సరఫరాకు భారీగా బ్రేకులు పడ్డాయి. డిమాండ్‌కు తగ్గట్లు మార్కెట్‌లో సిలిండర్లు రాకపోవడంతో.. కమర్షియల్ గ్యాస్ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఈ ఎఫెక్ట్‌తో ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌లలో వేలాది రెస్టారెంట్లు తాత్కాలికంగా బోర్డులు తిప్పేస్తున్నాయి.
చిరు వ్యాపారుల విలవిల
పెద్ద పెద్ద హోటల్స్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక రోడ్డు పక్కన టిఫిన్ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుకునే వాళ్ల కష్టాలు వర్ణనాతీతం. కనీసం ఎక్కువ రేటు పెట్టి బ్లాక్ మార్కెట్లో కొందామన్నా సిలిండర్లు దొరకని పరిస్థితి. వ్యాపారం నడవక, కార్మికులకు జీతాలు ఇవ్వలేక ఓనర్లు తలలు పట్టుకుంటున్నారు. రోజూ హోటల్ ఫుడ్ మీద ఆధారపడే బ్యాచిలర్స్, ఉద్యోగులైతే తినడానికి సరైన ఆప్షన్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
రేపటి నుంచి పరిస్థితి ఏంటి?
ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒకవేళ గ్యాస్ సప్లై నెమ్మదిగా గాడిన పడినా.. హోటల్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిలిండర్ కొరతతో జరిగిన నష్టాన్ని, పెరిగిన గ్యాస్ రేట్లను కవర్ చేసుకోవడానికి మెనూలో ఫుడ్ రేట్లను పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే, అంతిమంగా ఈ సంక్షోభం భారం పడేది సామాన్యుడి జేబుపైనే. పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందా అని అటు ఫుడ్ లవర్స్‌తో పాటు ఇటు వ్యాపారులు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.


